Site icon NTV Telugu

JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్‌లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..

Jp Nadda

Jp Nadda

JP Nadda: ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి ‘వంశపారంపర్య పార్టీల’ కూటమిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటే, మరో సగం మంది బెయిల్‌పై ఉన్నారని అన్నారు. ఈ రోజు రాజస్థాన్ ఝాలావర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అలయన్స్ అనేది అవినీతి రక్షణ కూటమి అని అన్నారు. ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అన్ని చోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ బెయిల్‌పై వచ్చారా..? లేదా..?, సోనియాగాంధీ, చిదంబర్, సంజయ్ సింగ్ బెయిల్‌పై బయట ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారా..? లేదా..?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమిలో సగం నేతలు జైలులో ఉంటే, సగం మంది బెయిల్‌పై బయట ఉన్నారు.

Read Also: Summer Heatwave: ఈ వేసవి చాలా హాట్ గురూ.. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు..

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని నడ్డా ప్రశంసించారు. ఈ రోజు దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉందని చెప్పారు. మోడీ నాయకత్వంలో గ్రామాల పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. 2014లో మోడీ ప్రధాని అయ్యే సమయానికి 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని చెప్పారు. 3.5 లక్షల గ్రామాలకు రోడ్లతో అనుసంధానించామని అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, ఫలితంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది అందులోంచి బయటపడ్డారని చెప్పారు. పేదలు, రిక్షా పుల్లర్లు, టీ విక్రేతలు, బస్సు డ్రైవర్లు మరియు క్లీనర్లతో సహా 55 కోట్ల మంది జనాభాలో 40 శాతం మందికి తీవ్రమైన అనారోగ్యాల కోసం ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు.

Exit mobile version