NTV Telugu Site icon

Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ హతం..? పాక్ ఎస్ఎంలో వైరల్ న్యూస్..

Hafiz Saeed

Hafiz Saeed

Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

పాకిస్తాన్ ఆర్మీ కోర్ కమాండర్‌ని కలిసి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మరణించిన అబూ ఖతల్ హఫీస్ సయీద్‌కి ముఖ్య అనుచరుడు, లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి. 2024 జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడి నుండి కాట్రాకు వెళ్తున్న బస్సుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అబూ ఖతల్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.

Read Also: PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..

ఇదిలా ఉంటే, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కూడా మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్స్ వేదికగా నెటిజన్లు ఈ విషయాన్ని చెబుతన్నారు. అయితే, పాక్ అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, దాడిలో అతడికి తీవ్ర గాయాలై, ఆస్పత్రిలో మరణించినట్లు పేర్కొంటున్నాయి. హఫీస్ సయీద్ మేనల్లుడు అబూ ఖతల్ సింధి, అతడి డ్రైవర్‌తో కలిసి అక్కడికక్కడే మరణించినట్లు చెబుతున్నాయి. మరికొందరు మాత్రం రావల్పిండి ఆస్పత్రిలో మరణించినట్లు చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTIకి చెందిన ఒక నాయకుడు సమద్ యాకూబ్, ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోశారు. ‘‘నాకు ఉన్న సమాచారం ప్రకారం.. హఫీజ్ సయీద్, అతని మేనల్లుడు దాడిలో మరణించారు” అని పేర్కొన్నారు. తన తండ్రి బాగానే ఉన్నాడని సయీద్ కుమారుడు తల్హాసయీద్ చెప్పినప్పటికీ, అతడి గొంతు దీనికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నాడు.

హఫీజ్ సయీద్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు, 26/11 ముంబై దాడులు మరియు పుల్వామా దాడితో సహా అనేక దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జాతీయ భద్రతకు అతన్ని పెద్ద ముప్పుగా పరిగణించి, భారత ప్రభుత్వం చాలా కాలంగా అతని అప్పగింతను కోరుతోంది. పాకిస్తాన్ అదే పనిగా భారత వాదనల్ని తప్పుపడుతోంది.