తమిళనాడు కేంద్రంగా హెచ్-1 బీ వీసాల అక్రమాలు జరుగుతున్నాయంటూ భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్-1 బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలతో ట్రంప్ ఇటీవల కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో హెచ్-1 బీ వీసాలు దొరకకపోవడంతో విదేశీ ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హెచ్-1 బీ వీసాల కోసం నకిలీ డిగ్రీలు, రాజకీయ ప్రోదల్బంతో వీసాలు పొందుతున్నారంటూ మహవష్ సిద్ధిఖీ ఆరోపించారు.

మహవష్ సిద్ధిఖీ.. 2005-07 మధ్య చెన్నై కాన్సులేట్‌లో అమెరికా దౌత్యవేత్తగా పని చేశారు. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఉందని.. భారతీయులతో భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికోసం భారతీయులకు జారీ చేసిన 80-90 శాతం హెచ్-1 బీ వీసాలు నకిలీవేనని ఆరోపించారు. నకిలీ డిగ్రీలు, పత్రాలతో పొందుతున్నారని.. వారికి కావాల్సిన నైపుణ్యం లేదని చెప్పుకొచ్చారు. దౌత్యవేత్తగా ఉన్న సమయంలో చెన్నైలో ఈ మోసాన్ని గుర్తించానని.. విదేశాంగ కార్యదర్శికి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. భారత్‌లో మోసం.. లంచం సాధారణమైనవిగా ఉన్నాయని.. ఒక భారతీయ-అమెరికన్‌గా ఇలా చెప్పేందుకు తనకు కష్టంగానే ఉందని చెప్పారు.

చెన్నై కేంద్రంగా హెచ్-1బీ వీసాల జారీపై చాలా అక్రమాలు జరిగాయని అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా ఆరోపించారు. చెన్నై కేంద్రంగా 2 లక్షల హెచ్-1 బీ వీసాలు పొందడం చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. భారతదేశానికి కేవలం 85 వేల వరకే హెచ్-1బీ వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉంది. అలాంటప్పుడు భారత్‌లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 హెచ్-1బీ వీసాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అంటే ఎక్కడో.. ఏదో మోసం జరుగుతుందనేది అర్థమవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Trump-Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌పై ట్రంప్ అసంతృప్తి.. కాష్ పటేల్‌ను తొలగిస్తున్నట్లు వార్తలు!