Gulam Nabi Azad Interesting Comments On Article 370: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మరో పది రోజుల్లోనే తన కొత్త పార్టీని ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే తనపై వచ్చిన విమర్శల మీద స్పందస్తూ.. ‘‘నా మీద కాంగ్రెస్ నేతలు మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించా. ఆ దెబ్బకు వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ వినియోగించి ఉంటే, వారి పరిస్థితేంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయేవారు’’ అని కౌంటర్లు వేశారు.
ఇదే సమయంలో.. రెండేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్ముకశ్మీర్‌కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ సాధించుకోవడం అసాధ్యమని అన్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని మభ్యపెడుతున్నాయని, కానీ తాను మాత్రం అందరిలా మభ్యపెట్టలేనని అన్నారు. ఓట్ల కోసం కశ్మీర్ ప్రజల్ని తాను మోసం చేయలేనని, కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తానన్నారు. ఆర్టికల్ 370ని తీసుకురావడమన్నది సాధ్యం కాని విషయమని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటే.. పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీని సాధించాల్సి ఉంటుందని, అయితే అధి అసాధ్యమని వెల్లడించారు. బీజేపీని కాదని, ఆర్టికల్ 370కి అనుకూలంగా మెజార్టీని సాధించే పార్టీ దేశంలో ఏదీ లేదని గులాం నబీ ఆజాద్ ఉధ్ఘాటించారు.
జమ్ముకశ్మీర్‌ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని.. అయితే ఇప్పటికీ జమ్ముకశ్మీర్‌లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఉన్నారంటూ స్థానిక రాజకీయ పార్టీలను గులాంనబీ ఆజాద్ టార్గెట్ చేశారు. అందరూ జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నారన్నారు. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదని.. ప్రజలే తన పార్టీ పేరుతో పాటు జెండా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. జమ్ముకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంతో పాటు స్థానిక ప్రజల ఉద్యోగ, భూమి హక్కులను కాపాడాలన్న ఎజెండా విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
