MLA son-in-law rash driving.. Six people died: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆనంద్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమార్తెలు ఉన్నారు. రక్షా బంధన్ జరుపుకుని వస్తుండగా..కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది.
ప్రమాదం జరిగిన సమయంలోనే ఆటో డ్రైవర్, బైక్ నడుపుతున్న వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతులంగా సోజిత్ర, బొరియావీ గ్రామాల ప్రజలుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన కారు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ పర్మార్ బంధువు కేతన్ పాధియార్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. కేతన్ స్వయానా ఎమ్మెల్యేకు అల్లుడు. కేతన్ అతివేగంగా, అజాగ్రత్తగా కారును నడిపి ఆరుగురి మరణాలకు కారణం అయ్యాడు. ప్రస్తుతం కేతన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 304 కేసును పెట్టారు. మృతులను సోజిత్రాలోని నవగఢ్ గ్రామానికి చెందిన జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వినబెన్ మిస్త్రీ, ఆటోరిక్షా డ్రైవర్ యాసన్ వోహ్రా, ఆనంద్‌లోని యోగేష్ ఓడ్, సందీప్ ఓడ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో కేతన్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంపై బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజమైన ముఖం అంటూ ట్వీట్ చేశారు.