Site icon NTV Telugu

BBC Documentary on Modi: బీబీసీపై చర్యలు తీసుకోవాలి.. అసెంబ్లీ తీర్మానం..

Gujarat Passes Resolution On Bbc Documentary On Modi

Gujarat Passes Resolution On Bbc Documentary On Modi

Gujarat passes resolution On BBC Documentary on Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ) ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటు భారత్ లోనూ.. అటు బ్రిటన్ లోనూ ఈ డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో పాటు పలువురు సమర్థించారు. భారత దేశం ఏకంగా దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రమేయం ఉందని డాక్యుమెంటరీలో ఆరోపించారు.

Read Also: Topless At Public Swimming: టాప్‌లెస్‌గా మహిళల స్విమ్మింగ్‌కు అనుమతి.. ఏ దేశంలో తెలుసా..?

ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఈ డాక్యుమెంటరీపై తీర్మానం చేసింది. ఇది వాస్తవాలను వక్రీకరించిందని, బీబీసీపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు అమిత్ ఠక్కర్, ధవల్‌సిన్హ్ జాలా, మనీషా వకీల్ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. బీబీసీ భారత్, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి డాక్యుమెంటరీని రూపొందించిందని ఎమ్మెల్యే విపుల్ పటేల్ అన్నారు.

రెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ డాక్యుమెంటరీ ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని, 135 కోట్ల ప్రజలకు వ్యతిరేకం అని హర్ష్ సంఘవి పేర్కొన్నారు. కె జి షా కమిషన్, నానావతి-షా కమిషన్, సుప్రీంకోర్టు కూడా గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిందని మరో ఎమ్మెల్యే పటేల్ అన్నారు. ఈ డాక్యుమెంట్ పై యూట్యూబ్ లింకులు, ట్విట్టర్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత గత నెలలో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ చేసింది.

Exit mobile version