Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండీ.. అధికారంలో ఉంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. అంతగా అక్కడ బీజేపీ బలంగా ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తామని ఇది వరకే ఈసీ వెల్లడించింది. గుజరాత్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఎన్నికల్లో బీజేపీని ఎలా విజయతీరాలకు చేరస్తారో చూడాలి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. దేశ ప్రజల మూడ్ ను వ్యక్తం చేసేలా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.