Bhavesh Bhandari: గుజరాత్‌కి చెందిన భార్యభర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి, జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక వేడుకలో భావేష్ భండారీ, అతని భార్య లేష్ దీక్షా తమ సంపద మొత్తాన్ని త్యజించి, సాధారణ జీవితానికి కట్టుబడాలని సన్యాసులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హిమ్మత్ నగర్‌కి చెందిన నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్న ఈ జంట తమ పిల్లల అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించారు.
భవేష్ భాయ్ భండారీ 19 ఏళ్ల కుమారుడు విశ్వ మరియు 16 ఏళ్ల కుమార్తె భవ్య 2021లో జైన సన్యాసులుగా మారారు. వీరి నుంచి ప్రేరణ పొందిత తాము కూడా సన్యాసత్వాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. వారు భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరడానికి నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 22న ఈ దంపతులు అన్ని కుటుంబ సంబంధాలను తెంచుకోవాలి, భౌతిక వస్తువులకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. దేశమంతటా చెప్పులు లేకుండా, భిక్షతో మాత్రమే వారు జీవించనున్నారు. వారు కేవలం తెల్ల వస్త్రాలను ధరించి, భిక్ష కోసం ఒక గిన్నెను మాత్రమే కలిగి ఉంటారు.
Read Also: Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..!
అపార సంపద కలిగిన భండారీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భండారీ దంపుతు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లను, ఏపీలతో సహా తమ ఆస్తులన్నింటిని విరాళంగా ఇచ్చారు.
జైనమతంలో దీక్ష తీసుకోవడం అనేది ముఖ్యమైన ఆచారం. ఇది వ్యక్తిని భౌతిక సుఖాలకు దూరం చేస్తుంది. గతేడాది గుజరాత్‌లోని మల్టీ మిలియనీర్ వజ్రాల వ్యాపారి, అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. 2017లో మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ ధనవంతుల కుటుంబం రూ. 100 కోట్లను విరాళంగా ఇచ్చేసి, తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసులుగా మారిన వార్త ప్రముఖంగా నిలిచింది. సుమిత్ రాథోడ్(35), అతని భార్య అనామిక(34) తమ కుమార్తెను వారి తాతయ్య, నానమ్మ దగ్గర వదిలపెట్టి సన్యాసులుగా మారారు.