Govt bans 45 YouTube videos: భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. దేశంలో అశాంతి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు పాకిస్తాన్ బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న మరికొన్ని ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరో 10 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లలో 45 వీడియోలను బ్లాక్ చేయాలని ఆదేశించింది కేంద్రం. ప్రస్తుతం బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల వ్యూయర్ షిప్ 1.30 కోట్లుగా ఉంది. బ్లాక్ చేసిన వీడియోల్లో యూట్యూబర్ ధృవ్ రాతీ వీడియో కూడా ఉంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 23న ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా “జుట్టు ముడవడమే” తప్పైంది.. కాల్చి చంపిన ఇరాన్
దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. తప్పుడు సమాచారం ద్వారా స్నేహపూర్వక దేశాలతో సంబంధాలు దెబ్బతినే విధంగా చేస్తున్న 10 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నామని.. దేశ ప్రయోజనాల కోసం ఇంతకుముందు కూడా ఇలాగే చేశామని.. ఇకపై కూడా ఇలాగే చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2021లోని నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఫేక్ న్యూస్ ద్వారా మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడంతో పాటు భారతదేశంపై అంతర్యుద్ధం ప్రకటించడం, దేశంలో మతసామరస్యాన్ని, ప్రజాశాంతికి భంగం కలిగేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నాయని గుర్తించింది కేంద్రం. అగ్నిపథ్ స్కీమ్, భారత సాయుధ దళాలు, భారత జాతీయ భద్రతా యంత్రాంగం, కాశ్మీర్ వంటి వాటిపై తప్పుడు సమాచారాన్ని ఈ యూట్యూబ్ ఛానెళ్లు వ్యాప్తి చేస్తున్నాయి. కొన్ని వీడియోలు భారత భూభాగం నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను తొలగించి భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా ప్రయత్నిస్తున్నాయి. ఇలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది కేంద్రం.
