Site icon NTV Telugu

Waqf Act: “వక్ఫ్ ఆస్తుల” రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం..

Waqf Bill

Waqf Bill

Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్‌ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు, వెడల్పు, జియో ట్యాగ్ చేయబడిన స్థానాలతో సహా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. మహిళల పేర్లతో నమోదు చేయబడిన ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి అర్హత ఉండదు. వక్ఫ్ ఆస్తుల ప్రాథమిక లబ్ధిదారులలో మహిళలు, పిల్లలు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు.

Read Also: Jagtial: పామును కాపాడబోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు గేర్ బాక్స్ లో చొరబడిన పాము.. చివరకు

సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డులు రిజిస్ట్రేషన్లను సులభతరం చేస్తాయి. సాంకేతిక లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల నిర్ణీత కాలపరిమితి లోపు నమోదు చేయని ఆస్తులను ఒకటి నుంచి రెండు నెలల పొడిగింపు కోరవచ్చు. అయితే, అనుమతించబడిన వ్యవధిలో నమోదు చేయని ఆస్తులను వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి, పరిష్కారం కోసం వక్ఫ్ ట్రిబ్యునల్స్‌కి పంపుతారు.

ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 నేపథ్యంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతోంది. ఏప్రిల్ 5న పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చట్టం రాజ్యాంగ హామీలను ఉల్లంఘించిందని పిటిషన్లు పేర్కొన్నాయి. అయితే, ఈ పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోర్టుని కోరింది. ఏప్రిల్ 17న, ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని నిబంధనలను అమలు చేయబోమని హామీ ఇచ్చిన తర్వాత, చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 27న జరిగిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రం, ఇతర పార్టీల నుండి ప్రతిస్పందనలను కోరింది.

Exit mobile version