Google: సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం.
Read Also: 26/11 Mumbai Attack: ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆజం చీమా పాక్‌లో మృతి..
శుక్రవారం గూగుల్ 10 భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించింది. దీంతో ఒక్కసారిగా వివాదం ఏర్పడింది. నౌకరి, 99 ఎకర్స్, భారత్ మ్యాట్రిమోనీ వంటి ప్రసిద్ధ యాప్‌లను తొలగించింది. గూగుల్ యాప్‌లపై 11 నుంచి 26 శాతం వరకు రుసుము విధించడం వివాదానికి కారణమైంది. భారతీయ స్టార్టప్‌లు గూగుల్ అన్యాయమైన విధానాలు అవలంభిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 94 శాతం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్స్ వాడుతున్న భారత్‌పై గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తుందనే విమర్శలు ఉన్నాయి. తొలగించిన యాప్స్‌లో ఆల్ట్ బాలాజీ, భారత్ మాట్రిమోనీ, కుకు ఎఫ్ఎం, షాదీ. కామ్ వంటి పలు యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ తొలగింపుపై స్టే విధించాలని గత నెల సంబంధిత కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. దీనిపై ఈ నెల 19న మరోసారి విచారణ జరగనుంది.