NTV Telugu Site icon

Global Terrorism Index 2025: టెర్రరిజంలో రెండో స్థానంలో పాకిస్తాన్.. భారత్ స్థానం ఎంతంటే..

Pakistan

Pakistan

Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.

Read Also: Intermediate Paper Leak : ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) ప్రచురించిన తాజా GTI నివేదిక, ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల పరిస్థితిని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణనష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేని వెల్లడించారు. గత 5 ఏళ్లుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని, 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45 శాతం భారీగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2024లో పాక్‌లో జరిగిన 52 శాతం మరణాలకు పాక్ తాలిబాన్లు కారణమని చెప్పింది. ముఖ్యంగా ఆ దేశంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు సంభవించినట్లు చెప్పింది.

భారతదేశంలో ఈ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టాప్-10 దేశాల జాబితాను పరిశీలిస్తే వరసగా- బుర్కినాఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్ ఉన్నాయి. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ దేశం ఉంది. భారత్ పొరుగు దేశాలను గమనిస్తే, బంగ్లాదేశ్ 35 స్థానంలో, అమెరికా(34) కన్నా ఒక ర్యాంకు దిగువన ఉండటం గమనార్హం. మయన్మార్ 11వ స్థానంలో ఉంది. అనూహ్యంగా ఇరాక్, ఇరాన్, పాలస్తీనా వంటి దేశాలు టాప్-10 జాబితాలో లేవు.