జాతీయ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజీనామా సందర్భంగా రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. అదే సందర్భంలో రాహుల్ పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ది ది పిల్లవాడి మనస్తత్వమని, మెచ్యూరిటీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఆజాద్ ప్రశంసించారు. రాహుల్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. అయితే ప్రస్తుత రాజకీయాలకు ఆయన పనికిరారని అన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీకి అర్థమే లేకుండా పోయిందని ఆజాద్ విమర్శించారు. గతంలో సీడబ్ల్యూసీలో కేవలం సీడబ్ల్యూసీ మెంబర్లు మాత్రమే ఉండేవారని… కానీ, గత పదేళ్లలో 25 మంది సీడబ్ల్యూసీ మెంబర్లతో పాటు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటున్నారని అన్నారు. 1998 నుంచి 2004 వరకు సోనియాగాంధీ ప్రతి విషయంలో సీనియర్లను సంప్రదించేవారని, సీనియర్లు ఇచ్చే సలహాలను, సూచనలను ఆమె స్వీకరించేవారని చెప్పారు. అయితే తదనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. 2004 నుంచి ఆమె సీనియర్లను పక్కన పెట్టేసి, పూర్తిగా రాహుల్ పై ఆధారపడటాన్ని ప్రారంభించారని మండిపడ్డారు ఆజాద్. రాహుల్ కు రాజకీయాలను నడిపే శక్తిసామర్థ్యాలు లేవని.. ఆయన అన్ ఫిట్ అనేశారు ఆజాద్.
2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని రాహుల్ తీసుకొచ్చారని… ఈ నినాదానికి మద్దతు పలికే నేతలు చేతులు ఎత్తాలని పార్టీ మీటింగ్ లో రాహుల్ అడగారని… అయితే చాలా మంది సీనియర్ నేతలు ఆ నినాదాన్ని వ్యతిరేకించారని ఆజాద్ చెప్పారు. ఆ మీటింగ్ లో తాను, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, చిదంబరం కూడా ఉన్నామని చెప్పుకొచ్చారు గులాం నబీ ఆజాద్. ఇందిరాగాంధీ నుంచి తాము రాజకీయాలను నేర్చుకున్నామని ఆజాద్ చెప్పారు. రాహుల్ పై తనకు ఎలాంటి పగ లేదని ఆజాద్ చెప్పారు. రాహుల్ ఒక మంచి వ్యక్తి, జంటిల్మన్ అని ప్రశంసించారు. తన పట్ల రాహుల్ ఎప్పుడూ విధేయతతోనే ఉన్నారని అన్నారు. అయితే రాజకీయవేత్తగా మాత్రం రాహుల్ అంత అర్హుడు కాదన్నారు. దని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, చిన్నాన్న సంజయ్ గాంధీల మాదిరి కష్టపడే తత్వం రాహుల్ కి లేదని అన్నారు. తాను సొంత పార్టీ పెట్టబోతున్నాననే వార్తలపై స్పందిస్తూ… జమ్మూకశ్మీర్ లో సొంత పార్టీని పెట్టబోతున్నానని స్పష్టం చేశారు. ఇతర పార్టీల చెంతకు వెళ్ళే అవకాశం లేదన్నారు ఆజాద్. ఈయన కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
