Site icon NTV Telugu

Gautam Adani: 5,800 మీటర్ల నుంచి పడిపోయిన పర్వతారోహకుడికి గౌతమ్ అదానీ సహాయం

Adani Foundation

Adani Foundation

Gautam Adani: గత నెల నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఖాట్మాండ్ నుంచి న్యూఢిల్లీ తరలించేందు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. గాయపడిన తన తమ్ముడిని విమానంలో తరలించేందుకు సకాలంలో సాయం చేసిన గౌతమ్ అదానీకి అనురాగ్ మాలూ సోదరుడు ఆశిశ్ మాలూ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?

రాజస్థాన్ కిషన్ గఢ్ లో నివసించే అనురాగ్ మాలూ ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ 3 నుంచి దిగుతుండగా.. 5800 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయి తప్పిపోయాడు. అతడిని ఏప్రిల్ 20న మూడు రోజుల తర్వాత రక్షించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నేపాల్ లోని పోఖారాలోని మణిపాల్ ఆస్పత్రికి అక్కడ నుంచి ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో ఎతైన పర్వతాల్లో అన్నపూర్ణ 10వది. ఇది ఉండే హిమాలయ ప్రాంతం ప్రమాదాలకు నెలవు.

నేపాల్ నుంచి భారతదేశానికి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి తమ వద్ద అందుకు అవసరమయ్యే డబ్బు లేదని, ఆదుకోవాల్సిందిగా మాలూ కుటుంబం అదానీ ఫౌండేషన్ సహాయాన్ని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. అదానీ ఫౌండేషన్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాలూను ఖాట్మాండు నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం అతడిని న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదానీ ఫౌండేషన్ కు గౌతమ్ అదానీ భార్య ప్రీతీ చీఫ్ గా ఉన్నారు. గాయపడిన పర్వతారోహకుడికి సహాయం అందించడం తన భార్యకు దొరికిన గొప్ప అవకాశం అదానీ అని కొనియాడారు. అనురాగ్ మాలూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Exit mobile version