NTV Telugu Site icon

Gauri Lankesh murder: గౌరీ లంకేష్ హత్యా నిందితులకు హిందూ అనుకూల సంఘాల నుంచి ఘనస్వాగతం..

Gauri Lankesh Murder

Gauri Lankesh Murder

Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్‌మోర్, మనోహర్ యాదవ్‌లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.

కర్ణాటకలోని విజయపురలోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారికి హిందూ అనుకూల మద్దతుదారులు పూలమాలలు వేసి, కాషాయ శాలువాలతో సత్కరించారు. నినాదాలతో స్వాగతం పలికారు. వారిద్దరిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. అనంతరం కాళికా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుల మద్దతుదారులు మాట్లాడుతూ.. వారిని తప్పుగా జైలులో పెట్టారని పేర్కొన్నారు.

Read Also: Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్‌‌కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..

వాఘ్‌మోర్, యాదవ్‌లతో పాటు అమోల్ కాలే, రాజేష్ డి బంగేరా, వాసుదేశ్ సూర్యవంశీ, రుషీకేష్ దేవదేకర్, గణేష్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డీలకు అక్టోబర్ 09న బెయిల్ మంజూరైంది. ప్రోహిందూ లీడర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విజయదశమి, మాకు ముఖ్యమైన రోజు. గౌరీ లంకేష్ హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఆరేళ్లుగా అన్యాయంగా జైలులో ఉన్న పరశురామ్ వాఘ్మోర్, మనోహర్ యాదవ్‌లను మేము స్వాగతిస్తున్నాము. అసలు నేరస్థులు ఇంకా కనుగొనబడలేదు, కానీ ఈ వ్యక్తులు కేవలం హిందూ అనుకూలులుగా ఉన్నందుకు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అన్యాయానికి తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరం.’’ అని అన్నారు.

వామపక్ష భావాలు ఉన్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్, హిందుత్వ భావజాలానికి బద్ధవ్యతిరేకిగా ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 05, 2017న బెంగళూర్‌లో ఆమె ఇంటి వెలుపల ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 2023లో గౌరీలంకేష్ హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.