NTV Telugu Site icon

Priyanka Gandhi: దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ రాయ్‌బరేలీలో పర్యటించారు. దేశంలో ఏదో రోజు ప్రభుత్వం తమను దేశద్రోహులు అని పిలుస్తుందని మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు ఊహించలేదని అన్నారు. గాంధీ, నెహ్రూలు ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు ఉద్యమాలు చేశారని, తమను ద్రోహులుగా పిలిచే ప్రభుత్వం వస్తుందని ఊహించలేదని ఆరోపించారు. ప్రభుత్వమే మా ప్రజలను బలహీనపరచానికి ప్రయత్నిస్తోందని వారు ఊహించలేదని అన్నారు.

Read Also: Radhika Khera: కాంగ్రెస్ వేధింపుల కారణంగా బీజేపీలో చేరిన రాధికా ఖేరా..

ప్రియాంకాగాంధీ బ్రిటిష్ రాజ్ సమయంలో రైతుల నిరసనల్ని కూడా ప్రస్తావించారు. ఆ సమయంలో రాయ్‌బరేలీలో జరిగిన రైతులు నిరసనలో పాల్గొన్నందుకు మోతీలాల్ నెహ్రూ, గాంధీలను మొదటిసారిగా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి రాయ్‌బరేలీలో ఓ వైపు ప్రజాస్వామ్యం, నిజం ఉంటే మరోవైపు ఉగ్రవాదం తరహా రాజకీయాలు ఉన్నాయని అన్నారు. ఈ పోరాటంలో మీరు ఎల్లప్పుడూ సత్యం, ప్రజాస్వామ్య సూత్రాలకు విజయాన్ని అందించారని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. గతంలో పలు పర్యాయాలు సోనియా గాంధీ ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు ఆమెకు కోపం రాలేదని, ఆ ఓటమి నుంచి ఆమె నేర్చుకుంది, తర్వాతి ఎన్నికల్లో గెలిచిందని ప్రియాంకా గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కిషోరీ లాల్ శర్మను బరిలోకి దింపింది. ఈ రెండు స్థానాల్లో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.