NTV Telugu Site icon

Korean youtuber harassed: లైంగిక వేధింపులకు గురైన కొరియా యూట్యూబర్ భద్రతకు విదేశాంగశాఖ హామీ..

Korean Youtuber Incident

Korean Youtuber Incident

Korean youtuber harassed: ముంబైలో ఇద్దరు ఆకతాయిలు దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. ఈ వీడియో బుధవారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ముంబైలో వేధింపుకు గురైన దక్షిణ కొరియా వ్లాగర్ కు రక్షణ, భద్రత కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక అధికారులు ఆమెకు అవసరమైన రక్షణ కల్పించారని అనుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

దక్షిణ కొరియా జాతీయురాలు అయిన యూట్యబూర్ మంగళవారం రాత్రి ముంబై లోని ఖార్ ప్రాంతం నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల ఆమెను వేధించారు. బలవంతంగా తమ కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. నిందితులు మోబీన్ చంద్ మహ్మద్ షేక్(18), మహ్మద్ నకీబ్ సదరియాలం అన్సారీ(20)గా నిందితులను గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో ఓ యువకుడు మహిళపై చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనపై కొరియన్ యూట్యూబర్ స్పందించారు. నాకు వేరే దేశంలో కూడా ఇలాగే జరిగాయి కానీ ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను. అయితే ఈసారి మాత్రం భారతదేశంలో వేగంగా చర్యలు తీసుకున్నారని.. నేను మూడు వారాలకు పైగా ముంబైలోనే ఉన్నాను.. ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నానని యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ అన్నారు.  ఇటువంటి చర్యలు నాపై ప్రభావం చూపించవని.. అద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తానని తెలిపింది.

 

Show comments