Site icon NTV Telugu

Rajiv Gandhi Foundation: సోనియాగాంధీకి బిగ్ షాక్.. రెండు ఎన్జీవోల లైసెన్సులు రద్దు.. సీబీఐ దర్యాప్తుకు ఛాన్స్

Rajiv Gandhi Foundation

Rajiv Gandhi Foundation

Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో గాంధీ కుటుంబం బుక్ అయింది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆర్జీఎఫ్ కు చీఫ్ గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాలు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సభ్యులుగా ఉన్నారు. ఆర్జీసీటీకి సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా ఉండగా.. రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ ఎస్. గంగూలీ సభ్యులుగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఈ రెండు ఎన్జీవోల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 2020లో హో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పత్రాలను తారుమారు చేయడంతో పాటు, నిధుల దుర్వినియోగం, చైనాతో సహా ఇతర విదేశాల నుంచి నిధులు పొందుతున్న సమయంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఎన్జీవోలు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రెండు సంస్థలు 2005-09 మధ్య చైనా నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్జీఎఫ్ కి నిధులు అందాయని.. దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మోహుల్ చోక్సీ నుంచి కూడా వీటిని నిధులు అందాయని నడ్డా ఆరోపించారు. చైనా-ఇండియా మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం లాబీయింగ్ చేయడానికి ఆర్జీఎఫ్ కు నిధులను చైనా లంచంగా ఇచ్చిందనే ఆరోపణలను చేసింది బీజేపీ.

Exit mobile version