విమానం ఆలస్యం కావడం వల్ల ఓ రైతు తీసుకొచ్చిన అరుదైన హైబ్రిడ్ మొక్క దెబ్బతినడంతో, ఎయిర్‌ఏషియా సంస్థకు వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. రైతుకు మొత్తం రూ.90,750 నష్టపరిహారం చెల్లించాలని కేరళ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
ఏం జరిగింది?
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ హైబ్రిడ్ పండ్ల సాగు చేస్తూ వాటిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన 2025 ఆగస్టులో మలేషియా, ఇండోనేషియా దేశాలకు వెళ్లి ప్రత్యేక రకం హైబ్రిడ్ పనస మొక్కలను కొనుగోలు చేశారు.
ఆగస్టు 30న ఇండోనేషియాలోని మెడాన్-కువాలనాము విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ మీదుగా కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. అయితే మెడాన్-కువాలనాము నుంచి బయలుదేరాల్సిన ఎయిర్‌ఏషియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో, కొచ్చికి వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్‌ను ఆయన మిస్ అయ్యారు. దీంతో ఆయన వెంట తీసుకొచ్చిన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతింది.
ఎయిర్‌ఏషియా స్పందించలేదు
ఈ ఘటనపై అబ్దుల్ అజీజ్ కేరళ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 2026 ఫిబ్రవరి 7న ఇ-మెయిల్ ద్వారా నోటీసులు అందినప్పటికీ, ఎయిర్‌ఏషియా కమిషన్ ఎదుట హాజరు కాలేదు. ఎటువంటి వివరణ లేదా ప్రతిస్పందన కూడా సమర్పించలేదు. దీంతో కమిషన్ ఏకపక్షంగా విచారణ కొనసాగించి, ఫిర్యాదుదారుడి వాదనను సమర్థించింది. విమానం ఆలస్యం కావడం, కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కావడం పూర్తిగా విమానయాన సంస్థ సేవల్లో లోపం, సమన్వయాభావం కారణంగానే జరిగిందని స్పష్టం చేసింది.
కమిషన్ కీలక వ్యాఖ్యలు
తన తీర్పులో కమిషన్, “విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్ల ఫిర్యాదుదారుడు ఆర్థిక నష్టంతో పాటు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అందువల్ల ఆయనకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొంది. అలాగే, “రైతు చేసిన మొత్తం ప్రయాణ ఖర్చు వృథా అయింది. మరోసారి అదే మొక్కను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియాకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని వ్యాఖ్యానించింది.
రూ.90,750 నష్టపరిహారం చెల్లించాలి
ఈ కేసులో ఎయిర్‌ఏషియాకు కమిషన్ ఈ కింది విధంగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
విమాన టికెట్ మొత్తంగా రూ.30,750 తిరిగి చెల్లించాలి.
ప్రయాణ, వసతి ఖర్చుల కింద రూ.25,000 ఇవ్వాలి.
సేవల్లో లోపానికి పరిహారంగా రూ.25,000 చెల్లించాలి.
న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.10,000 అందించాలి.
మొత్తంగా రూ.90,750ను 45 రోజులలోగా రైతుకు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, పూర్తి మొత్తం చెల్లించే వరకు ప్రతి నెల రూ.500 చొప్పున అదనపు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలకంగా నిలవడంతో పాటు, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే సంస్థలకు హెచ్చరికగా మారింది.

