One Nation One Election:‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే రోజే సమావేశం జరగనుంది. సెస్టెంబర్ 23న జమిలి ఎన్నికలకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతుంది.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తుండగా.. కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉంటారు
Read Also: Amit Shah: లాలూ, నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
ఈ కమిటీ సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడు కాగా.. న్యాయవ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ప్యానెల్ కి కార్యదర్శిగా వ్యవహారిస్తారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం మొదలైన అంశాలపై సవరణలు, ఏదైనా ఇతర చట్టాలు, నియమాలను పరిశీలించి కమిటీ సిఫారసులు చేస్తుంది.
సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. కమిటీ నియామకం ముందు ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంట్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రోజే కేంద్రం జమిలి ఎన్నికలపై కమిటీని నియమించింది. అయితే జమిలి ఎన్నికలను కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ మాత్రం జమిలితో ఖర్చులు తగ్గుతాయని వీటిని అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టొచ్చని చెబుతోంది.