Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుండె పగిలే రిపోర్ట్!

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన రిపోర్ట్ విడుదలకానున్నట్లు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థలు తుది నివేదికను సిద్ధం చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. ఈ రిపోర్ట్‌లో గుండె పగిలే విషయాలు ఉన్నట్లుగా కథనాలు పేర్కొన్నాయి.

జూన్ 12, 2025న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్తుండగా సెకన్ల వ్యవధిలోనే హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఒక్కరు మినహా 241 మంది చనిపోగా.. హాస్టల్‌లో ఉన్న పలువురు మెడికోలు కూడా మృతిచెందారు. మొత్తంగా 271 మంది మృత్యువాత పడ్డారు.

అనంతరం ఈ ప్రమాదంపై రెండు భారత సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. నెలరోజుల తర్వాత భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక రిపోర్టును విడుదల చేసింది. అందులో ఇంధన స్విచ్‌లు ఆపేసినట్లుగా వెల్లడించింది. ఈ రిపోర్ట్‌పై అంతర్జాతీయ మీడియాలో పైలట్ ఆత్మహత్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కథనాలు ప్రచారం చేశాయి. ఈ కథనాలపై పైలట్ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. తుది నివేదిక రాకుండా ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తుది నివేదిక సిద్ధమైనట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. ఉద్దేశపూర్వకంగానే పైలట్ ఇంధన స్విచ్‌లు ఆపేసినట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఎయిరిండియా విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేనట్లుగా తేల్చాయి. ఇంజిన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లను మాన్యువల్‌గా షట్‌డౌన్ చేయడంలో ఉద్దేశపూర్వకంగా జరిగిందని తాజా వార్తా నివేదిక పేర్కొంది.

తాజాగా న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలతో సంబంధం ఉన్న రెండు వర్గాలను ఉటంకిస్తూ ఇటాలియన్ దినపత్రిక కొరియల్ డెల్లా సెరా ఈ వార్తను నివేదించింది. ఈ ప్రమాదం కచ్చితంగా ‘‘ఉద్దేశపూర్వక చర్య’’గా కథనంలో తేల్చి చెప్పింది. తుది నివేదికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వాషింగ్టన్‌తో భారత దర్యాప్తు సంస్థలు జరిపిన చర్చల తర్వాత ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చాయని.. దర్యాప్తులో సహాయం చేసిన అమెరికా నిపుణులను ఉద్దేశిస్తూ ‘‘ఇదొక ముందడుగు’’గా అభవర్ణించినట్లుగా వార్తాపత్రిక పేర్కొంది.

ఈ సందర్భంగా కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌ను కూడా ప్రస్తావించింది. ఒక పైలట్… ‘‘మీరు ఇంధనాన్ని ఎందుకు ఆపేశారు?’’ అని అడగడం వినిపించింది. మరొకరు.. ‘‘నేను అలా చేయలేదు.’’ అని బదులిచ్చినట్లుగా రికార్డైంది.

పైలట్లలో ఒకరు ఇంజిన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లను ఆపివేయడం వల్ల విమానం శక్తిని కోల్పోయి నేలపై పడిపోయిందని దర్యాప్తు అధికారులు ఇప్పుడు నమ్ముతున్నారని కథనంలో పేర్కొంది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్‌ క్లైవ్ కుందర్గా మధ్య సంభాషణను భారత్ సంస్థలు అంగీకరించినట్లుగా ఇటాలియన్ వార్తాపత్రిక స్పష్టం చేసింది. ప్రధాన అనుమానితుడు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ బాధ్యతలు అస్పష్టంగానే ఉన్నాయని.. చాలా రోజుల నుంచి మానసికంగా నిరాశతో బాధపడుతున్నట్లుగా కథనంలో వెల్లడించింది.

గతంలో ప్రాథమిక రిపోర్ట్‌లో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలు వచ్చినప్పుడు పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి.. మానసిక ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలు తోసిపుచ్చారు. అంతేకాకుండా భార్యతో విడాకులు.. వ్యక్తిగత సమస్యలు లేవన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తుది నివేదిక వచ్చేంత వరకు ఏమీ అనవద్దని సూచించింది. తాజాగా పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు ఒక ముగింపునకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఫైనల్ రిపోర్ట్ విడుదల కానుంది.

Exit mobile version