NTV Telugu Site icon

Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంతిమయాత్రపై కాంగ్రెస్ కీలక ప్రకటన

Manmohansingh

Manmohansingh

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు.

ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉంటే మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. మన్మోహన్ అంత్యక్రియలు శనివారం ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఉదయం 9:30కి ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్‌ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని అభివర్ణించారు. నిజాయితీ, సరళత, పార్లమెంటేరియన్‌‌గా విశిష్టమైన సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. మన్మోహన్‌కు నివాళులర్పించేందుకు కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మన్మోహన్ గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. ఈ సంతాప దినాలు జనవరి 1, 2025 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భారతదేశం అంతటా జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు. విదేశాలలో ఉన్న అన్ని భారతీయ మిషన్లు మరియు హైకమిషన్లలో అదే వ్యవధిలో జెండా సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు.

Show comments