Vande Bharat Express: ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 10న ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే అవన్నీ ఉత్తర భారత దేశంలోనే పలు రూట్లలో నడుస్తున్నాయి. తాజాగా ఈ ఐదో వందే భారత్ రైలును దక్షిణాదిలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. నవంబర్ నెలలో చెన్నై-బెంగళూర్-మైసూర్ మార్గంలో ఈ రైలును ప్రారంభించనున్నారు.
Read Also: Ravi Shastri: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. గంగూలీకి పరోక్షంగా రవిశాస్త్రి చురకలు
భారత రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమి హై స్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లను ప్రారంభించారు. గురువారం హిమచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో నాలుగో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ, చండీగఢ్ మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటలకు తగ్గించనుంది. హిమచల్ ప్రదేశ్ లోని అంబ్ అందౌరా-న్యూఢిల్లీ మార్గంలో వారంలో బుధవారం మినహా అన్ని రోజుల్లో ప్రయాణించనుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు.
అంతకుముందు సెప్టెంబర్ 30న మూడో వందే భారత్ రైలును ప్రధాని మోదీ గుజరాత్ గాంధీనగర్- ముంబైల మధ్య ప్రారంభించారు. భారతదేశంలో మొదటి వందే భారత్ రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య, రెండో వందే భారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీ వైష్ణోదేవి కట్రా మధ్య ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఐదో వందేభారత్ రైలును దక్షిణాదిలో ప్రారంభించనున్నారు. సెమి హైస్పీడ్ ట్రైన్ గా వందే భారత్ రైలును అభివృద్ధి చేశారు. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు ఈ వందే భారత్ రైలులో ఉన్నాయి. యాంటీ ట్రైన్ కొలిజన్ వ్యవస్థ ‘‘ కవచ్ ’’ వంటి అత్యాధునిక వ్యవస్థలు వందే భారత్ రైలులో ఉన్నాయి.