NTV Telugu Site icon

US Reciprocal Tariffs: అమెరికా సుంకాల భయం.. మార్చి 15 నాటికి టారిఫ్‌లపై ప్రభుత్వం సమీక్ష..

Us Reciprocal Tariffs

Us Reciprocal Tariffs

US Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘‘సుంకాల’’తో ప్రపంచదేశాలను భయపెడుతున్నాడు. ‘‘పరస్పర సుంకాలు’’ తప్పకుండా ఉంటాయని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించారు. మరోవైపు సుంకాలు విధింపులో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కారు.

ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలపై తగ్గింపును సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని భారత్ నియమించింది. మార్చి 15నాటికి దాని నివేదిక సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2 నాటికి భారత ఎగుమతులపై పరస్పర సుంకాలు విధించాలనే అమెరికా అధ్యక్షుడి ప్లాన్ ముందు ఈ చర్య వచ్చింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ కమిటీ తన ఫలితాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ రెండింటికీ సమర్పించనుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ తప్పనిసరిగా సాధ్యమయ్యే సుంకాల తగ్గింపుల పరిధిని అంచనా వేస్తుంది. తదుపరి ఉత్తమ చర్యల్ని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దిగుమతి చేసుకునే వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు వాటిపై సుంకాల సర్దుబాట్లు చేసే పనిని కమిటీ పరిశీలిస్తుంది. ఈ సమీక్ష ప్యానెల్ ప్రత్యేకంగా 15–20%, 50–70% , 70–80% మధ్య ఉన్న సుంకాలను, కస్టమ్ ప్రయోజనాల కోసం నిర్దిష్ట ఉత్పత్తిని గుర్తించే 8-అంకెల కోడ్‌లో రేటు సర్దుబాటు చేయవచ్చా అనేదానిపై దృష్టిపెడుతుందని తెలిసింది.

Read Also: Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..

ట్రంప్ బెదిరింపులతో ఇండియా ఇప్పటికే కొన్ని ప్రోడక్ట్స్‌పై సుంకాలను తగ్గించింది. బోర్బర్ విస్కీపై 150 శాతం నుంచి 100 శాతానికి సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు ఫిష్ హైడ్రోలైజేట్, స్క్రాప్ మెటీరియల్స్, ఉపగ్రహ పరికరాలు, ఈథర్నెట్ స్విచ్‌లు, మోటార్ సైకిళ్ల వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించింది. కమిటీ తన సిఫారసుల్ని ప్రతిపాదించిన తర్వాత ప్రధాని కార్యాలయం వీటిని పరిశీలించాల్సి ఉంటుంది. భారత్ తన సొంత ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాతో ట్రేడ్ బ్యాలెన్స్ కొనసాగించాలని కోరుకుంటోంది.

మరోవైపు భారత్-అమెరికా మధ్య ప్రతిపాది వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. రాబోయే 6-8 నెలల్లో దీనిని సమర్పించాలని భావిస్తున్నారు. ‘‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’’ ప్రకారం, ఇరు దేశాలు తమ తమ ఉత్పత్తులపై కస్టమ్ సుంకాలను తొలగించడం లేదా గణనీయంగా తగ్గించడానికి పని చేస్తుంది. దీంతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించడం సులభతరం అవుతుంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సమయంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు చేయాలని, అంటే 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.