Site icon NTV Telugu

Fake IPL : ఫేక్‌ ఐపీఎల్‌ ఆట.. కేటుగాళ్ల వసూళ్ల వేట..

Fake Ipl

Fake Ipl

కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అంటే.. కాదేది మోసానికి అనర్హమంటున్నారు కేటుగాళ్లు.. ఇప్పటికే డబ్బులు దండుకోవడానికి కొత్త కొత్తలను ఎంచుకుంటున్న మోసగాళ్లు.. ఇప్పుడు ఫేక్‌ ఐపీఎల్‌ లీగ్‌కు తెర తీశారు. అచ్చం నిజమైన ఐపీఎల్‌ మ్యాచ్‌ల మాదిరిగానే ఏకంగా ఐపీఎల్‌ టీంలనే తయారు చేశారు ఈ ఫేక్‌గాళ్లు. ఐపీఎల్‌ పేరిట నకిలీ మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ పందెంరాయుళ్ల నుంచి డబ్బులు దండిగా దండుకునే పనిపెట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఐపీఎల్‌ పేరిట ఫేక్‌ మ్యాచ్‌లను ఓ ముఠా నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. ఆ మ్యాచ్‌లను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఒరిజినల్‌ మ్యాచ్‌ల మాదిరిగా నిర్వహిస్తూ.. రష్యాకు చెందిన బెట్టింగ్‌ రాముళ్లకు వల వేశారు. అయితే..ఇంతకు ఈ ఫేక్‌ ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరో కాదు.. వ్యవసాయ కూలీలు.. అవునూ.. వ్యవసాయ కూలీలకే రూ.400 కూలీ ఇచ్చి.. ప్రముఖ క్రికెటర్ల మాదిరిగా వారికి జెర్సీవేయించి గ్రౌండ్‌లోకి దించుతున్నారు.

అంతేకాకుండా.. అంపైర్లుగా వ్యవహరించే వారి చేతిలో డమ్మి వాకీటాకీలు పెట్టి.. ఫేక్‌ ఐపీఎల్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి తోడు.. ప్రముఖ కామెంటర్‌..హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్‌ ఐపీఎల్‌ మొత్తానికి ఫినిషింగ్‌ టచ్‌. ఇక్కడి ఇంకో విషయం ఎంటంటే.. ఈ ఫేక్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ చివరి దశ.. అంటే క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడం కొసమెరుపు. దీన్ని పసిగట్టిన పోలీసులు.. ఇప్పటికే నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. అయితే.. ఈ ముఠా లీడర్‌ షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్‌ కేంద్రంలో గతంలో పని చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ విషయం తెలిసిన క్రికెట్‌ అభిమానులు ఇదేందయ్య ఇది.. అంటూ.. షాక్‌ అవుతున్నారు.

 

 

Exit mobile version