Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు. జాతీయ మీడియా ఛానెల్‌లోని ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎంసీ ఎన్నిలకకు ముందు, 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిశారు. వీరిద్దరు ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు.
Read Also: Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్
ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు అక్కాచెళ్లిళ్ల పిల్లలని, వీరిద్దరికి తాను సన్నిహితుడినని, ఒక వేళ వీరిద్దరి కలయికలో తన పాత్ర ఏదైనా ఉంటే అదృష్టంగా భావిస్తానని అన్నారు. ఠాక్రే సోదరులు ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉంటేనే మరాఠీ ప్రజలు మనుగడ సాగిస్తారని ఆయన అన్నారు. రాబోయే ముంబై ఎన్నికల్లో ఠాక్రేల పార్టీల నుంచే మేయర్ వస్తారని అన్నారు. ఠాక్రే వర్గం ఇకపై ఏక్‌నాథ్ షిండేతో కలిసి పనిచేయదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కలియకపై మాట్లాడుతూ, హిందుత్వ-లౌకిక ఎజెండాపై విభేదాలు ఉన్నప్పటికీ, దేశానికి ప్రాధాన్యత ఇవ్వడంతోనే కాంగ్రెస్‌తో కలిసినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సంజయ్ రౌత్‌వి పనికిరాని బెదిరింపులని కొట్టిపారేశారు. ఏక్‌నాథ్ షిండేను ముంబైలో అడుగుపెట్టనివ్వమని చెప్పారని, కానీ ఆయన 50 మంది ఎమ్మెల్యేలతో వచ్చి రాజ్‌భవన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడు ముంబై బంద్ ఉండేదని,కానీ ఈ రోజుల్లో అది పనిచేయదని ఫడ్నవీస్ అన్నారు.
