Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో భాషగా తీసుకురావడాన్ని వీరిద్దరు వ్యతిరేకించారు. అయితే, ఈ ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది.
ఇదిలా ఉంటే, తమను బాలాసాహెబ్ ఠాక్రే కూడా కలపలేకపోయారని, ఫడ్నవీస్ వల్ల మేము కలిశామంటూ రాజ్ ఠాక్రే వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ‘‘సోదరులను తిరిగి కలిపినందుకు నాకు క్రెడిట్ ఇచ్చినందుకు రాజ్ థాకరేకు థాంక్స్. నాకు బాలాసాహెబ్ ఠాక్రే ఆశీస్సులు లభించి ఉండాలి. ఇది విజయ్ ర్యాలీ అని చెబుతున్నారు. అయితే, అది ‘రుదాలి’ ప్రసంగంగా మారింది’’ అని విమర్శించారు. రాజస్థాన్‌లో అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బహిరంగంగా సంతాపం తెలిపే మహిళల్ని రుదాలి అని అంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేసిన రెండు వివాదాస్పద తీర్మానాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నందుకు వేడుకగా థాకరే బంధువులు ముంబైలో నిర్వహించిన ఈ ర్యాలీని నిర్వహించారు. 25 ఏళ్లుగా ముంబై నగరంలో పాలనలో ఉన్నప్పటికీ శివసేన అభివృద్దిని పట్టించుకోలేదని, కానీ మోడీ నాయకత్వంలో బీజేపీ ముంబైని మార్చిందని అన్నారు.
ఠాక్రేల విజయ్ ర్యాలీని విమర్శిస్తూ, మరాఠీ గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా, వారి ప్రభుత్వం ఎలా కూలిపోయిందో, మళ్లీ ఎలా అధికారంలోకి రావాలని మాత్రమే ఠాక్రేలు ప్రసంగాల్లో పేర్కొన్నారని, వారి బాధ మరాఠీ గురించి కాదని, అధికారం గురించి అని అన్నారు. ముంబైలో మరాఠీ, మరాఠీయేతర జనాభా అంతా బీజేపీతోనే ఉన్నారని, మేము మరాఠీలము, హిందుత్వవాదులమని, హిందువులుగా గర్విస్తున్నామని ఫడ్నవీస్ అన్నారు.
