NTV Telugu Site icon

New Delhi: సత్యేంద్ర జైన్ కు మధ్యంతర బెయిల్ పొడిగింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

Satyendra Jain

Satyendra Jain

New Delhi: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కు వైద్య కారణాలతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు జూలై 24 వరకు పొడిగించింది. అతడి వైద్య నివేదికలను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సమర్పించాలని జైన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

Read also: Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ ఖమ్మంని మరిపించేలా ఉంటుంది

జైన్ కు శస్త్రచికిత్స చేయాలని మూడు ఆస్పత్రులు సిఫారసు చేశాయని సింఘ్వీ తెలిపారు. వైద్య కారణాల దృష్ట్యా మే 26న జైన్ కు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఒక పౌరుడు తన సొంత ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు నచ్చిన చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొంది. జైన్ తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా ఆయన మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ.. గత ఏడాది మే 30న జైన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Read also: Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను జూలై 14న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తన భార్య తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిందని, ఈ కేసును విచారణకు స్వీకరించాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టును కోరడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించేందుకు అంగీకరించింది.ఈ కేసు విచారణను జూలై 17న లిస్ట్ చేసినప్పటికీ జూలై 14న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ సిసోడియా గతవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో తన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహించిన సిసోడియాకు.. లిక్కర్ పాలసీ స్కామ్ లో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Show comments