NTV Telugu Site icon

CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్​లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తమ జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు.

Read also: Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తాం..

హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జోయిటిస్‌ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.

Read also: Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి

జోయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు. జోయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోంది.
Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..