Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెహికిల్ పై నాగ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన అనిల్ దేశ్‌ముఖ్.. ఆ తర్వాత కటోల్‌కు తిరుగు ప్రయాణమవ్వగా.. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్ ఫాటా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Temperature Drop: వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
అయితే, ఈ ఘటనలో మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కటోల్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ స్టార్ట్ చేశామని.. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు నాగ్‌పుర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దర్ పేర్కొన్నారు. అనిల్ దేశ్‌ముఖ్ గతంలో మహారాష్ట్ర హోంమంత్రిగా విధులు నిర్వహించారు. రూ. కోట్లలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.. దీంతో మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ (ఎస్పీ) తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.