Ex Bureaucrats Slam BJP’s Pragya Thakur Over “Hindus, Keep Knives” Speech: ‘‘హిందువులు కత్తులను ఉంచుకోండి’’ అంటూ ఇటీవల ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (సాధ్వీ ప్రగ్యా) కర్ణాటకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ 103 మంది మాజీ బ్యూరోక్రాట్లు లోక్ సభ స్పీకర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లోక్ సభ నైతిక కమిటీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
READ ALSO: Good News: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త
భోపాల్ బీజేపీ ఎంపీగా ఉన్న ప్రగ్యా ఠాకూర్, డిసెంబర్ 25న కర్ణాటక శివమొగ్గలో విద్వేష ప్రసంగం చేశారు. ముస్లింల పేరు చెప్పకుండా.. వారికి ‘జిహాద్’ సంప్రదాయం ఉంది. ఏమీ చేయలేకపోతే మన హిందూ బాలికలను ప్రలోభపరుచుకోవడానికి ‘‘లవ్ జిహాద్’’ చేస్తారని వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ కు పాల్పడే వారికి సమాధానం చెప్పండి, మన అమ్మాయిలను రక్షించండి, వారికి సరైన విలువలు నేర్పించండి.. మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి, కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా ఉంచుకోండి అంటూ ఓ హిందూ గ్రూపు సదస్సులో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై 103 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. లేఖలో సంతకం చేసిన వారిలో మాజీ కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ సీఎస్ సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఎస్పీ ఆంబ్రోస్ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాదం చేసిన ప్రగ్యా ఠాకూర్ దాన్ని ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా సమాజంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో రోజూవారీగా విషం చిమ్ముతున్నారని, సమాజంలో వారి స్థాయిని తగ్గించేలా ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను శివమొగ్గ పోలీసులు పట్టించుకోలేదని, ఆమెపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
