Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో అంబేద్కర్‌ని చేర్చడానికి జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని యోగి అన్నారు. గత వారం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో యోగి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
దళితులను, అణగారిని వర్గాల వారిని అగౌరపరిచే కాంగ్రెస్ విధానాన్ని సమాజ్‌వాదీ పార్టీ కూడా అవలంబిస్తోందని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న గౌరవం కాంగ్రెస్‌కి లేదని, అంబేద్కర్ చదువుకున్న మోవ్, నాగ్‌పూర్, ముంబై, లండన్‌లోని ముఖ్యప్రదేశాలను స్మారక చిహ్నాలు రూపొందించినట్లు వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వమైనా అంబేద్కర్ ఆశయాలను గౌరవించిందని చెప్పారు.
రాజ్యాంగ పరిషరత్, ముసాయిదా కమిటీలో అంబేద్కర్‌ని చేర్చుకునే ఆసక్తి కాంగ్రెస్‌కి లేదని చెప్పారు. ముంబై నార్త్ నుండి 1952 సాధారణ ఎన్నికలు, 1954 ఉప ఎన్నికలతో సహా ఎన్నికలలో అంబేద్కర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ కృషి చేసిందని ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆయన ఓడిపోయేలా చేశారంటూ ఆరోపించారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గౌరవం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని యోగి విమర్శించారు. బీజేపీనే అంబేద్కర్‌కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధిపొందాలని అనుకుందని, బీజేపీ ఎంపీలపై దాడి చేయడం రాజ్యాంగ బద్ధమా అని కాంగ్రెస్‌ని యోగి ప్రశ్నించారు.