Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’కేసులో పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ నుంచి డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. ఇలా లంచం తీసుకుని ప్రధాని మోడీను ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 అదానీపైనే ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపిస్తూ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Read Also: Tiger claw row: నెమలి ఈకలు మసీదులు, దర్గాల్లో ఉంటున్నాయి.. వాటిపై కూడా దాడులు చేయాలి..
ఇదిలా ఉంటే ఈ కేసులో దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించారు. తన నుంచి ఎంపీ మోయిత్రా లంచం తీసుకున్నది నిజమే అని, తనతో చేయకూడని పనులు చేయించిందని అందులో ఆరోపించారు. తాజాగా ఈ రోజు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఆరోపణలు చేసిన ఎంపీ నిషికాంత్ దూబేను మూడు గంటలు విచారించిన తర్వాత మహువా మోయిత్రాకు అక్టోబర్ 31న హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
ఇదిలా ఉంటే మోయిత్రాకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ వేరే వ్యక్తలు చేతికి వెళ్లినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. అయితే మోయిత్రా చేసిన విదేశీ పర్యటన వివరాలను హోంమంత్రిత్వ శాఖను నుంచి పార్లమెంట్ ప్యానెల్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో టీఎంసీ మహువా మోయిత్రాకు దూరంగా ఉంటుంది. విచారణ జరుగుతుందని ఏం జరుగుతుందో చూడాలనే ధోరణిని టీఎంసీ ప్రదర్శిస్తోంది.