రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్నడ నటుడు దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది. తొలిసారిగా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న వ్యక్తి.. 2024 జూన్ 8న జరిగిన ఘటనలపై తనకు తెలిసిన విషయాలను వివరంగా వెల్లడించాడు. కేసులో అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమైన అతడు.. హత్యలో నటుడు దర్శన్ పాత్రపై సంచలన ఆరోపణలు చేశాడు.
దర్శన్‌కు సన్నిహితుడిగా ఉన్న ప్రదూష్ ఎస్. రావు బెంగళూరు కోర్టును ఆశ్రయించాడు. తనను అప్రూవర్‌గా పరిగణించి క్షమాభిక్ష ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. నేరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, అందులో నటుడు దర్శన్ పాత్రను పూర్తిగా, నిజాయితీగా వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషన్‌లో దర్శన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామిపై దాడి చేస్తున్న సమయంలో దర్శన్ అతడి ఛాతిపై నిలబడి, పలుమార్లు తన్నాడని ఆరోపించాడు. అనంతరం హత్యకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు నకిలీ కథను సృష్టించారని పేర్కొన్నాడు.
తాను షెడ్డుకు వెళ్లిన సమయంలో రేణుకాస్వామి నేలపై కూర్చుని ఉన్నాడని తెలిపాడు. అతడి చుట్టూ పలువురు వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నాడు. సోషల్ మీడియా సందేశాల విషయంలో రేణుకాస్వామిపై దర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆరోపించాడు. దర్శన్.. పవిత్ర గౌడను రేణుకాస్వామిని చెప్పుతో కొట్టాలని కూడా కోరినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అనంతరం అక్కడున్న మరికొందరు కర్రలతో రేణుకాస్వామిపై దాడి చేశారని ఆరోపించాడు. రేణుకాస్వామిపై దర్శన్ నైలాన్ తాడుతో కూడా దాడి చేశాడని పేర్కొన్నాడు. ‘ఛాలెంజింగ్ స్టార్’గా పేరున్న దర్శన్.. బాధితుడి మెడ, ఛాతిపై తన్నాడని, ఆ తర్వాత తన రెండు కాళ్లను అతడి ఛాతిపై ఉంచి నిలబడ్డాడని ఆరోపించాడు.
రేణుకాస్వామిపై దాడి కొనసాగుతున్న సమయంలో అతడు చనిపోయే ప్రమాదం ఉందని తాను దర్శన్‌ను హెచ్చరించినట్లు తెలిపాడు. అయినప్పటికీ దర్శన్ దాడిని ఆపలేదని ఆరోపించాడు. అనంతరం దర్శన్ డ్రైవర్ లక్ష్మణ్.. రేణుకాస్వామి చనిపోయినట్లు తనకు తెలిపాడని రావు పేర్కొన్నాడు. దర్శన్ తనకు రేణుకాస్వామి ఫోన్‌ను ఇచ్చి, అతడు ఇతర మహిళలకు కూడా సందేశాలు పంపాడా? అని పరిశీలించాలని చెప్పినట్లు తెలిపాడు. ఇక రేణుకాస్వామి మృతి చెందిన విషయం తెలుసుకున్న తర్వాత తాను దర్శన్ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అతడికి చెప్పినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపించాడు. తాను సహకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ బెదిరించినట్లు రావు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అనంతరం రేణుకాస్వామి హత్యకు ఆర్థిక వివాదమే కారణమన్నట్లు ఓ తప్పుడు కథను సిద్ధం చేశారని ఆరోపించాడు.
ఈ కేసులో నిందితులుగా లొంగిపోయేందుకు కొంతమంది వ్యక్తులను సిద్ధం చేశారని పేర్కొన్నాడు. ఇందుకోసం దర్శన్ నగదు ఉన్న బ్యాగ్‌ను బయటకు తీసి, ఇద్దరు వ్యక్తులకు రూ.15 లక్షలు ఇచ్చి.. హత్య కేసులో లొంగిపోయే వ్యక్తులను వెతకాలని చెప్పినట్లు ఆరోపించాడు. రేణుకాస్వామి మృతదేహాన్ని తెల్ల రంగు స్కార్పియో వాహనంలో ఉంచి, దానిని ఎక్కడ పడేయాలా అని ప్రాంతాలను వెతికారని తెలిపాడు. చివరకు ఓ డ్రెయిన్ సమీపంలో మృతదేహాన్ని పడేసినట్లు ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పలువురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే తాను, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు ప్రదూష్ రావు చేసిన అభ్యర్థనపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అతడి పిటిషన్‌లో చేసిన ఆరోపణలు ప్రస్తుతం న్యాయ ప్రక్రియలో భాగంగా ఉన్న వాదనలే.. వాటిపై తుది న్యాయ నిర్ణయం వెలువడాల్సి ఉంది.
33 ఏళ్ల రేణుకాస్వామిని బెంగళూరులోని కామాక్షిపాళ్యలో ఉన్న ఓ షెడ్డులో దర్శన్, మరికొందరు కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ సహనటి, స్నేహితురాలు పవిత్ర గౌడ సోషల్ మీడియా పోస్టులపై రేణుకాస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా పలువురిని 2024లో పోలీసులు అరెస్ట్ చేశారు.

