Site icon NTV Telugu

Chhattisgarh: రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే..!

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్‌లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్‌లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఒక సూసైడ్ నోట్‌ను రాసింది. ‘‘క్షమించండి అమ్మా, నాన్న’’. మీ అంచనాలను అందుకోలేపోతున్నా.. పరీక్షల ఒత్తిడి భరించలేకపోతున్నట్లు వాపోయింది. నా చదువు కారణంగా కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ అధికారుల అప్రమత్తం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యార్థిని రెండవ సంవత్సరం పరీక్షలకు మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ పేపర్లతో పాటు హాజరు కావాల్సి ఉన్నందున చదువులో ఒత్తిడికి గురైందని తెలుస్తోంది. పోలీసులు గది నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు.పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

ప్రిన్సీ కుటుంబం.. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పదే పదే కాల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఫోన్‌కు సమాధానం రాలేదు. ఏదో జరుగుతోందని భయపడి.. హాస్టల్ వార్డెన్‌ను సంప్రదించారు. వార్డెన్ గదికి చేరుకున్నప్పుడు తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. పదే పదే తలుపు తట్టినప్పటికీ స్పందన లేదు. వార్డెన్ కిటికీ గుండా చూడగా ఉరి వేసుకుని కనిపించింది.

ప్రిన్సీకి మొదటి సెమిస్టర్‌లో ఐదు సబ్జెక్టులలో బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని.. తిరిగి పరీక్షలకు సిద్ధమవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సెమిస్టర్ ఫీజుల కోసం వాయిదాల రూపంలో దాదాపు లక్ష రూపాయలు అడిగిందని తెలిపారు.

Exit mobile version