NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అక్కడ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తరుచూ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ రోజు కథువా జిల్లాలోని బనీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం రావడంతో ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు తెలిపారు.

Read Also: Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, చైనా వ్యూహాలపై ఇండియన్ నేవీ అత్యున్నత సమావేశం..

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ అంతటా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల్ని మన జవాన్లు మట్టుపెడుతున్నారు. అయితే, ఈ ఆపరేషన్లలో మన జవాన్లు కూడా వీరమరణం పొందుతున్నారు. మొదట్లో పూంచ్, రాజౌరీ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు జమ్మూ ప్రాంతానికి కూడా విస్తరించాయి. ఉధంపూర్, కథువా జిల్లాల్లో గతంలో ఉగ్రవాదం లేదు, కానీ ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. అత్యున్నత శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైనికులు కాన్వాయ్‌లపై మెరుపు దాడులు చేస్తున్నారు. గ్రెనేడ్స్, ఎం4 అసాల్ట్ రైఫిళ్లను వాడుతున్నారు.

గత రెండేళ్లుగా కాశ్మీర్ లోయను జమ్మూతో విభజిస్తున్న పీర్ పంజాల్ ప్రాంతంలో తిరుగుబాటు పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులు, కొండలు, గుహాలు ఉగ్రవాదులకు కేంద్రంగా మారుతున్నాయి. అదును చూసి దాడులకు తెగబడుతున్నారు.