Site icon NTV Telugu

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Encounter

Encounter

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలోని చిత్రగామ్, బారాముల్లా జిల్లాలోని యెడిపొరా, పఠాన్‌ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టగా.. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రెండు జిల్లాల్లో ఆపరేషన్‌ కొనసాగుతోందని కశ్మీర్‌ పోలీసులు ట్వీట్ చేశారు.

Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ముక్కోణపు పోటీ.. రేసులో ఖర్గే!

మంగళవారం తెల్లవారుజామున కుల్గాం జిల్లా అవ్హోతు గ్రామంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)తో కలిసి భారత సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలంలో రెండు ఏకే సిరీస్ రైఫిళ్లు, గ్రెనేడ్‌లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులను కుల్గాంలోని టకియాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, మహ్మద్ ఆసిఫ్ వానీగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఇద్దరూ జైషే మహ్మద్‌కు చెందిన వారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు గ్రామంలోని అనుమానిత గృహాలను సైన్యం చుట్టుముట్టింది. తర్వాత అదనపు దళాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. అనుమానిత ప్రదేశంలో ఉగ్రవాదుల ఉనికిని నిర్ధారించిన తర్వాత పౌరులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఉగ్రవాదులు లొంగిపోవాలని ఆర్మీ అధికారులు హెచ్చరించినా వారు కాల్పులు జరపడంతో.. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

Exit mobile version