NTV Telugu Site icon

Elon Musk: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ సంస్థ.. లైసెన్సు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు

Space X Starlink

Space X Starlink

Elon Musk’s SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్‌తో భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ (డీఓటీ)కి దరఖాస్తు చేసింది. స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసిందని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధేశించిన విధి విధానాల ప్రకారం ప్రభుత్వం లైసెన్సుపై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

గ్లోబల్ కంపెనీలు భారతీయ అంతరిక్షంపై ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ఎలాన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ఎక్స్ కూడా ఒకటి. ఇప్పటికే భారతీ గ్రూప్ కు సంబంధించిన వన్ వెబ్, రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటికే తమ లైసెన్సులను పొందాయి. శాటిలైట్ సేవలకు సంబంధించి లైసెన్సుల కోసం అప్లై చేసుకున్న మూడో సంస్థ స్పేస్ఎక్స్.

Read Also: Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్

ప్రస్తుతం స్పేస్ఎక్స్ సంస్థ ప్రైవేటు విభాగంలో అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తోంది. స్పేస్ఎక్స్ తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపిస్తోంది. డ్రాగన్ క్రూ ద్వారా అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం(ఐఎస్ఎస్)కు వ్యోమగాములను, సరకులను పంపుతోంది. ఈ విధంగా వ్యోమగాములను పంపిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా స్పేస్ఎక్స్ రికార్డు క్రియేట్ చేసింది. స్టార్‌లింక్ కాన్స్టెలేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది.

గ్లోబల్ కంపెనీలు భారతీయ స్పేస్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో బ్రాడ్‌బ్యాండ్-ఫ్రం-స్పేస్ సేవల విభాగంలో రానున్న కాలంలో పోటీ తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని విలువ 2025 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచానా. జియో, వన్ వెబ్, నెల్కో, కెనడాకు చెందిన టెలిసాట్, అమెజాన్ వంటి సంస్థలు భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.