Site icon NTV Telugu

Prashant Kishor: 9వ తరగతి పాస్‌కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు.. తేజస్వి యాదవ్‌పై విసుర్లు

Prashantkishor

Prashantkishor

బీహార్‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శలు గుప్పించారు. పిల్లల గురించి ఎలా చింతించాలో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి నేర్చుకోవాలని.. 9వ తరగతి పాస్ కాని కొడుకు కోసం ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. తేజస్వి యాదవ్.. బీహార్‌కు రాజు కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బుధవారం బీహార్‌లోని సరన్‌లో జరిగిన సభలో ప్రశాంత్ కిషోర్ ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..

‘‘ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్‌ యాదవ్‌ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ 9వ తరగతి కూడా పాస్‌ కాలేదు. కానీ కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తేజస్వీని బీహార్‌కు రాజును చేయాలని ఉబలాటపడుతున్నారు. మేము ఇలా మాట్లాడుతుంటే.. ఆయన్ను విమర్శిస్తున్నామని ప్రజలు అంటున్నారు. కాదు.. మేము ఆయన్ను ప్రశంసిస్తున్నాం. సామాన్య ప్రజల పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినా.. వారికి ఉద్యోగాలు రావడం లేదు’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Bengaluru Stampede: విజయోత్సవాలు వద్దని చెప్పాం.. ఆర్సీబీ వినలేదు!

బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నిరుద్యోగ యువత కోపంగా ఉందని తెలిపారు. ర్యాలీలకు వస్తు్న్న స్పందన చూస్తుంటే.. బీహార్‌ను పీడిస్తున్న అవినీతి పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారని.. అందుకే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. పెరుగుతున్నది తన వ్యక్తిగత గ్రాఫ్ కాదని.. బీహార్‌లో నిజమైన మార్పును చూడాలనుకునే ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ర్యాలీకి వచ్చిన వారు తన బంధువులు కాదని.. తన కులానికి చెందిన వారు కూడా కాదని.. సమాజంలోని విభిన్న వర్గాల నుంచి వ్యక్తమైన నిరాశకు ఇది ప్రధాన కారణం అన్నారు.

Exit mobile version