Election Commission: వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ బదిలీ ప్రక్రియ జిల్లా స్థాయి పరిపాలనా అధికారులు, పోలీస్ అధికారులకు వర్తించనుంది. ఇదే కాకుండా ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే రవాణా, ఎక్సైజ్ శాఖల అధికారులను కూడా బదిలీ చేయనున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలను నవంబర్ 30వ తేదీ లోగా అమలు చేయాలని, ఆ తర్వాత నివేదిక సమర్పించాలని ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది. గతంలో కూడా ఎన్నికల్ని స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుక ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ఎన్నిలకు జరిగిన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా బదిలీలు జరిగాయి.

