భారత దేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9 న జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నిక నోటిఫికేషన్ ఆగస్టు 7న విడుదల కానుంది . ఉపరాష్ట్ర పదవికి పోటీ పడే వారు ఆగస్టు 7 నుంచి, ఆగస్టు 21 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొత్తం పార్లమెంట్లోని వసుధ భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో జరగనుంది. సెప్టెంబర్ 9 న, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది..
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్ట్రోరల్ జాబితా
ప్రస్తుతం రాజ్యసభలో 233 మంది ఎన్నికైన సభ్యుల్లో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో 543 మంది ఎంపీల్లో ఒక స్థానం ఖాళీగా ఉంది. అలాగే 12 మంది నామినేట్‌డ్ రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 788 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతానికి 782 మంది ఓటు వేయనున్నారు. ఒక్కో ఎంపీకి ఓటు విలువ 1గా ఉంటుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది.. అంతేకాదు ఓటర్లు తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో వినియోగించుకోవాల్సి ఉంటుంది… ఓటర్లు ఈసీ అందించే ప్రత్యేక పెన్‌తో మాత్రమే బ్యాలెట్ పేపర్‌పై తమ ఎంపికను గుర్తించాలి. అయితే మొదటి ప్రాధాన్యత గుర్తించకపోతే ఓటు చెల్లదు. పార్టీలకు ఈ ఎన్నికలో తమ ఎంపీలకు విప్ జారీ చేసే అధికారం లేదు. రాజ్యసభ కార్యదర్శిని రిటర్నింగ్ ఆఫీసర్‌గా, మరో ఇద్దరిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నియమించింది.