దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2020లో ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. 2024లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ, జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వాలు కొలువుదీరాయి.
ఇక 2025 కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2020, ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 62 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా… కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేయడం ఆనవాయితీ. ఇందుకోసం ఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఓటర్ల తుది జాబితాను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఓటర్ల జాబితా విడుదలైన ఒకటి, రెండ్రోజుల్లో ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంటుంది. అయితే జనవరి 6 తర్వాత ఎప్పుడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ చివరి సమావేశాలు కూడా డిసెంబర్ 5తో ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే బీజేపీ కూడా నియోజకవర్గ కమిటీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆప్‌తో పొత్తు ఉండబోదని తెలిపింది. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.