ఎన్నికల సంఘం ఎన్ని విధానాలు, ప్రచారం నిర్వహించినా ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే నమోదవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు వచ్చే వారు ఓటింగ్ సమయంలో తమ స్వగ్రామాలకు వెళ్ళడంలేదు. దీంతో గ్రామాల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది.
సొంతూళ్లను విడిచి దూరంగా ఉన్న ఓటర్లకు ఈసీ గుడ్ న్యూస్ చెబుతోంది. ఇలాంటి వారికోసం ఉన్న చోటునుంచే ఓటుహక్కును వినియోగించుకునేలా రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ను అందుబాటులోకి తేనుంది. ప్రయాణ ఖర్చులు భరించి సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం కొందరికి కష్టంగా మారుతోంది. దీంతో లక్షలాదిమంది ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వస్థలాలను వదిలి బతుకు తెరువు కోసం వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసేవారికి ఓటుహక్కును వినియోగించుకోవడం గగనంగా మారడంతో దేశంలో కోట్లాదిమంది ఓటు వేయలేకపోతున్నారు.
ఇది ఆందోళన కలిగించే విషయమే. ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నాలు చేసింది. దీంట్లో భాగంగా రిమోట్ ఓటింగ్ ప్రవేశపెట్టబోతోంది. రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (ఆర్ విఎం) నమూనాను కూడా దీంతోపాటు రూపొందించింది. ఈ రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ద్వారా ఒక్క పోలింగ్ బూత్ నుంచే 72 నియోజకవర్గాల్లోని వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ మేరకు ఈ ఆర్ విఎంను డెవలప్ చేశారు. ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం జనవరి 16న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానం పంపింది. హడావిడిగా రిమోట్ ఓటింగ్ తెచ్చేకంటే ముందే దాని వల్ల న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ వివరించింది. దీనికోసమే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోనుంది.
ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి గల కారణాలను ఈసీ పరిశీలించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో నమోదైన పోలింగ్ శాతం 67.4. ఈ ఎన్నికల్లో దాదాపు దేశంలోని 30 కోట్ల మందికిపైగా ఓటర్లు.. వివిధ కారణాల వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితి ఆందోళనకరమైనది. ఓటర్లు తాము ఇప్పుడు ఉంటున్న కొత్త ప్రదేశాల్లో ఓటు నమోదు చేసుకోకపోవడానికి కారణాలు అనేకం. దీంతో అర్హులైన చాలా మంది ఓటు వేయలేకపోయారు. ఇందులో ప్రధాన కారణం అంతర్గత వలసలు. అంటే దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం. చదువు, ఉద్యోగాలు,పెళ్లిళ్లు వంటి కారణాలతో ఓటర్లు సొంత ప్రాంతాలను వదిలి దూరంగా వెళుతున్నారు. దేశంలో దాదాపుగా ఇలాంటి వారు 85 శాతం మంది ఉన్నారు’ అని ఈసీ తెలిపింది. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగలో దేశంలోని మరింత మంది పాల్గొనడానికి ఈ రిమోట్ వోటింగ్ విధానం దారి చూపుతుందని అన్నారు. ఈ విధానంపై కూలం కషంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి వుందంటోంది ఈసీ.
♦సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
♦ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ EC ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది.
♦దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. pic.twitter.com/JfX04Et8Ht— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 29, 2022