NTV Telugu Site icon

Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మద్దతు తెలిపారు. లోక్‌సభలో ఆయన అమృత్‌పాల్ సింగ్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ని ఎదుర్కొంటోందని చన్నీ అన్నారు. ‘‘ ప్రతీరోజు బీజేపీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. కానీ దేశం నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎద్కొంటోంది. ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైనా, అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. 20 లక్షల మందికి ఎంపీగా ఎన్నికైన అమృత్‌పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద కటకటాల వెనక ఉన్నారు. ఇది కూడా ఎమర్జెన్సీనే’’ అని చన్నీ అన్నారు.

Read Also: Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..

యూఏపీఏ చట్టం కింద ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు కొందరు అనుచరులు అస్సాం జైలులో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతను స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి 1,97,120 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్, చన్నీ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. తాను చన్నీ చెప్పేదాని గురించి ఆందోళన చెందడం లేదని, పంజాబ్ శాంతిభద్రతల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తానని అన్నారు. చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకుడు గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సిక్కు రాష్ట్రం ఖలిస్తాన్ కోసం ఉద్యమిస్తున్న వారికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దేశానికి ప్రమాదకరమని అన్నారు.