NTV Telugu Site icon

El Nino: పసిఫిక్‌లో “ఎల్ నినో”.. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటన.. వర్షాలపై ప్రభావం

Elnino

Elnino

El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వాతావరణంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?

జూలై నెలలో ఎల్ నినో ఏర్పడుతుందని అమెరికాతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి దీని తీవ్రత పెరగనుంది. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై, సముద్రంలో విపరీతమైన వేడి పెరగనుంది. ప్రతీ రెండు నుంచి 7 ఏళ్ల మధ్య కాలంలో ఒకసారి ఎల్ నినో ఏర్పడుతుంది. దాని తీవ్రత 9-12 నెలలు ఉంటుంది.

తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడాన్ని ‘ఎల్ నినో’గా అభివర్ణిస్తారు. 2016 లో బలమైన ఎల్ నినో ఏర్పడింది. ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి ఎల్ నినో తీవ్రత ఉంటుంది. ఆ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. చాలా సార్లు ఎల్ నినో ఏర్పడితే రుతుపవనాలు, వర్షపాతంపై ప్రభావం పడుతుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాత నమోదైంది.