Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు ముంబైలోని ధారావి స్లమ్ ఏరియా చుట్టూ తిరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాజెక్టు రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ధారావి ప్రాజెక్టు ముంబయిపై ప్రభావం చూపుతుందని, తాను అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని థాకరే నిన్న చెప్పారు.
Read Also: Samosas: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న సమోసా చిచ్చు.. అసలేమైందంటే..!
అయితే, ఆయన వ్యాఖ్యలపై సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఠాక్రే) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుని అడ్డుకోవడం తప్పా వారికి ఏం తెలుసు, వారి నుంచి ఏం ఆశించగలం..? అని ప్రశ్నించారు. ఈ నాయకులు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారని, ధారావిలోని ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. తన ప్రభుత్వం అందరికి ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఉందని, మహావికాస్ అఘాడీ తమ పథకాలను కాపీ కొట్టిందని షిండే ఆరోపించారు. వారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు.
ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, ఆసియాలోని 250 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న అతిపెద్ద మురికివాడను డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్. ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత అర్హులైన ఆ ప్రాంత నివాసులకు 350 చదరపు అడుగుల ప్లాట్ ఇవ్వబడుతుంది. అర్హత లేని వారికి నగరంలో మరో చోట పునరావాసం కల్పిస్తారు. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలలు, కమ్యూనిటీ హాల్లు, ఆస్పత్రులను నిర్మిస్తున్నారు.