Site icon NTV Telugu

National Herald Case: వరుసగా మూడో రోజు.. నేడు కూడా విచారణకు రాహుల్‌

Rahul

Rahul

నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధ‌వారం కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్‌ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్‌ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు నేతలు, వందలమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీల కుటుంబం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కుట్ర పన్నిందని.. అందులో భాగంగానే ఈడీపై ఒత్తిడి తెచ్చి బూటకపు కేసులో సోనియాగాంధీ, రాహుల్‌లకు సమన్లు జారీ చేయించిందని హస్తం పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలను కమలదళం తిప్పికొట్టింది. తమ నాయకులు చట్టానికి అతీతులన్నట్లుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించింది.

నగదు అక్రమ చలామణి వంటి బూటకపు కేసులు పెట్టడం ద్వారా గాంధీల కుటుంబాన్ని అపఖ్యాతి పాలుచేయడానికి, ఆ కుటుంబంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి భాజపా కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. హిందూత్వం పేరుతో దేశంలో కమలదళం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందనీ విమర్శించింది. రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన తెలపాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version