Site icon NTV Telugu

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజూ ఈడీ సోదాలు.. ఉదయం నుంచే..

National Herald Case

National Herald Case

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హెరాల్డ్​కు చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. మంగళవారం సెంట్రల్ దిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీతో పాటు లక్నో, కోల్‌కతా నగరాల్లోని 10 నుంచి 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. కేసు విచారణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రశ్నించిన అనంతరం ఈడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కిపైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలు జరుపుతున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. దర్యాప్తులో వెలుగు చూసిన నిధుల మళ్లింపు విషయమై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇటీవల కొందరిని ప్రశ్నించిన తర్వాత లభించిన ఆధారాలను బట్టి తాజా చర్యలు చేపట్టామన్నారు. నేషనల్ హెరాల్డ్ లావాదేవీల్లో భాగమైన సంస్థలతో పాటు నిధుల మళ్లింపునకు సంబంధించిన అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు మంగళవారం వెల్లడించారు.

Vice President Election: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌కు మాయావతి మద్దతు

ఏంటీ కేసు?: ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరో 38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50 లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇటివలే సోనియా, రాహుల్‌ను ప్రశ్నించింది. నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సల్‌ను ఇదివరకే ఈడీ విచారించింది. ఎలాంటి అవకతవకలూ లేవని.. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్‌ అంటోంది. ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ సందేహిస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

Exit mobile version