PM Modi- Jaishankar: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచారనే ఆరోపణలపై ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆ దేశ హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై రేపు (నవంబర్ 29) జైశంకర్ పార్లమెంట్‌లో వివరించనున్నారు.
Read Also: INS Arighaat: అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
ఇక, ఇస్కార్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అక్కడి కోర్టు ఒప్పుకోలేదు. దీంతో పలు హిందూ, మైనార్టీ సంఘాలు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. ఈ క్రమంలో ఓ యువ లాయర్ సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ప్రపంచ దేశాధినేతలు ఇప్పటికే పలుమార్లు ఖండించారు.