Site icon NTV Telugu

Donald Trump: భారత్‌లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం మాకు ఇష్టం లేదు: టిమ్‌కుక్‌తో ట్రంప్..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

ఖతార్ రాజధాని దోహాలో జరిగిన వ్యాపార కార్యక్రమంలో.. ట్రంప్ తనకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉందని అన్నారు.‘‘ మీరు భారతదేశం అంతటా ఆపిల్ కంపెనీ పెడుతున్నట్లు విన్నాను. భారత్‌లో నిర్మించాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి, కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టం’’ అని ట్రంప్ టిమ్ కుక్‌తో అన్నారు. తాను మాట్లాడిన తర్వాత ఆపిల్ అమెరికాలో తన ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ చెప్పారు. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తాని బెదిరించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Read Also: Tata EV Discounts 2025: ఆఫర్ అదిరింది.. టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.86 లక్షల డిస్కౌంట్

ఇదే కాకుండా, ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకాలు లేకుండా డీల్ ఆఫర్ చేసిందని అన్నారు. అయితే, భారత్ ఇలాంటి ఆఫర్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, మాక్‌బుక్‌లను ఉత్పత్తి చేసే ఆపిల్ సంస్థ అమెరికాలో ఉత్పత్తిని విస్తరిస్తుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. చైనా నుంచి భారత్‌కి వస్తున్న ఆపిల్, భారత్‌లో వేగంగా ఉత్పత్తిని విస్తరించాలని అనుకుంటున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రస్తుతం, భారత్‌లో ఆపిల్‌కి మూడు ప్లాంట్లు ఉన్నాయి. రెండు తమిళనాడులో ఒకటి కర్ణాటకలో ఉంది. వీటిలో ఒకదానిని ఫాక్స్‌కాన్ నిర్వహిస్తుండగా, మిగిలిన రెండింటిని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. మరో రెండు ఆపిల్ ప్లాంట్లు నిర్మించే దశలో ఉన్నాయి. మార్చితో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరంలో, ఆపిల్ భారతదేశంలో $22 బిలియన్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తిలో 60 శాతం పెరుగుదల.

Exit mobile version